హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక తీరుపై టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమన్నారు. 15 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకుల ధరల పెంపుదల తదితర ప్రజా సమన్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, జీ రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత గురువారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ‘పేదలను లూటీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి.. పేదలను కొట్టి పెద్దలకు పంచుతున్న మోదీ సర్కార్ డౌన్..డౌన్.’ అంటూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తే సభ్యుల గొంతు నొక్కేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
కొనసాగుతున్న 50 గంటల దీక్ష
పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినందుకు అన్యాయంగా సస్పెన్షన్‌కు గురైన టీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచం ద్ర, బడుగుల లింగయ్య యాదవ్ సహా డీఎంకే, టీఎం సీ, ఆప్, సీపీఐ, సీపీఎం సభ్యులు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద 50 గంటల నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం దీవకొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్ దీక్షలో పాల్గొన్నారు. మోదీ సర్కార్ దిగొచ్చేదాకా నిరసన కొనసాగుతుందని నిరసనలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. దీక్షకు దిగిన ఎంపీలు బుధవారం రాత్రంతా చలిలోనే నిరసన కొనసాగించారు.
మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్
పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్నది. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మరో ముగ్గురు ఎంపీలపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండైన వారిలో ఆప్ ఎంపీలు సుశీల్ కుమార్‌గుప్తా, సందీప్ కుమార్‌పాఠక్, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ ఉన్నారు. దీంతో సభ నుంచి సస్పెండైనవారి సంఖ్య 27కు చేరింది. ఇందులో నలుగురు లోక్‌సభ ఎంపీలు ఉన్నారు.