Chandrayaan-3 | బొడ్రాయి బజార్, జూలై 15 : ఇస్రో విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో సూర్యాపేట జిల్లాకు చెందిన శాస్త్రవేత్త భాగస్వామ్యం కూడా ఉండటం తెలంగాణకే గర్వకారణం. సూర్యాపేటలోని పిల్లలమర్రికి చెందిన చెరుకుపల్లి వెంకటరమణ ఇస్రో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం చంద్రయాన్‌తో నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం4 జంబో రాకెట్‌ను ఇండోనేషియా బియాక్ ద్వీపంలోని భూ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా గమనిస్తూ వెంకటరమణ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు అందించారు.
ఏకకాలంలో రాకెట్ నుంచి విడిపోయిన చంద్రయాన్-3 ప్రొపల్షన్, ల్యాండర్ మాడ్యుయల్ అంతరిక్షంలో ప్రారంభ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు వెంట వెంటనే చేరవేశారు. చంద్రయాన్-3 ఉపగ్రహానికి మొదటి భూ ట్రాకింగ్ ఆదేశాలను బెంగళూరు నుంచి బియాక్ స్టేషన్ ద్వారా విజయవంతంగా అందించారు. శనివారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించే మొట్టమొదటి కక్ష పెంచే కీలక ఈబీఎన్-1 విన్యాస ప్రక్రియను బియాక్ స్టేషన్ నుంచి విజయవంతంగా పర్యవేక్షించి కీలక సమాచారాన్ని బెంగళూరుకు అందించడమే గాక ఇక్కడి ఆదేశాలను చంద్రయాన్-3 ఉపగ్రహానికి చేరవేశారు.