కోదాడ, డిసెంబర్ 20: సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం శనివారం సస్పెండ్ అయ్యారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సీఎంఆర్ఎఫ్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నవంబర్ నెలలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత జైలుకు రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నవంబర్ 16న గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ రాజేశ్ మృతిచెందిన విషయం తెలిసిందే.
పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే రాజేశ్ చనిపోయినట్టు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, డీఎస్పీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజు తదితరులు ఆరోపిస్తూ అప్పట్లోనే ఆందోళనలు చేపట్టారు. ఇందుకు కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్సై బాధ్యులని డీజీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసు అధికారులు కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగంను సస్పెండ్ చేయడంతోపాటు చిలుకూరు ఎస్సై సురేశ్‌రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.