గద్వాల : ఎలాంటి సమాచారం లేకుండా వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లడంతో కలెక్టర్ ( Collector Rizwan Basha Shaik ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Rizwan Basha Shaik ) ఆదేశించారు.శుక్రవారం ఆలంపూర్ చౌరస్తాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ( Surprise hospital inspection ) .

ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో సిబ్బంది పని చేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రోగులు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ సరైన వైద్య సేవలు అందించకుండా కర్నూల్ కు,ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులను హెచ్చరించారు. ఆసుపత్రిలోని పలువురు రోగులను పలకరించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆహారాన్ని మెనూ ప్రకారం అందజేయాల న్నారు.ల్యాబ్ ను తనిఖీ చేసి ప్రతిరోజు వివిధ రకాల పరీక్షలను పక్కాగా చేస్తూ రోగులకు రిపోర్టును సకాలంలో అందజేయాలని ఆదేశించారు.
గైనిక్, యూఎస్ జీ, ఫార్మసీ, ఈసీజీ, తదితర విభాగాలను సందర్శించి అక్కడి సిబ్బంది పనితీరును గమనించారు. హాజరు రిజిస్టర్ తో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. కొంతమంది సిబ్బంది ఎక్కువగా సెలవులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరైన పనితీరు కనబరచకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలని, పరిసరాల్లోని పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు సయ్యద్ పాషా, ఉండవెల్లి తహసీల్దార్ ధరణి షా, తదితరులున్నారు.