హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుక్మా జిల్లా పరిధిలో బుధవారం సీఆర్పీఎఫ్ కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టు కేంద్రాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ హిడ్మాతోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో భద్రతాదళాల చాపర్‌పై మావోయిస్టులు రాకెట్ బాంబులు విసిరినట్టు సమాచారం. ఆ చాపర్ దెబ్బతిని అందులోని ఒక పైలట్‌తోపాటు మరో ఐదుగురు జవాన్లకు గాయాలైనట్టు తెలిసింది. అయినా, చాపర్‌లోని సిబ్బంది తమ లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి అధికారులెవరూ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, భద్రతా దళాల సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్టు బుధవారం సాయంత్రం బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఎల్మగుండ శిబిరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ దాడులు, కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా తప్పించుకున్నాడని రాత్రి వరకు మరికొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి.
హిడ్మాను టార్గెట్ చేయడం అంత సులభం కాదని, అతనికి భద్రతగా దాదాపు 300 మందికిపైగా మావోయిస్టు సైన్యం ఉంటుందని సమాచారం. అతడిని చేరుకోవాలంటే మూడు నుంచి ఐదు కిలోమీటర్ల రేంజ్లో మొదట మిలిషీయా దళం, రెండో అంచె భద్రతగా సెకండ్ ఫైరింగ్ టీమ్, మూడో అంచెలో ఫైనల్ ఫైరింగ్ టీమ్ ఉంటారని సమాచారం. ఈ మూడెంచల భద్రతను దాటుకొని హిడ్మాను చంపడమంటే మాటలు కాదని అంటున్నారు. అందుకే కూంబింగ్ కోసం చాపర్‌ను ఉపయోగించి.. దాని ద్వారా దాడులు చేసినట్ట్లు తెలుస్తున్నది. అయితే, హిడ్మా తలపై రూ.45 లక్షల రివార్డు ఉన్నది. గతంలోనూ హిడ్మా చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. కావాలనే ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు చేస్తుంటాడని అంటున్నారు. పాఠశాల స్థాయి వరకే చదువుకున్న హిడ్మా.. ఇంగ్లిష్, హిందీ అనర్గళంగా మాట్లాడతాడు. స్థానికుల మద్దతుతో అతనికి భద్రతా దళాల కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్లు త్వరగా తెలుస్తాయట. అతని ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా కొన్ని కిలోమీటర్ల అవతల ఉన్న భద్రతా దళాల కదలికలు కూడా పసిగడతాడని అంటున్నారు.