హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): చేవెళ్లలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు గురువారం విచ్చేసిన సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, సభ్యుడు సంజయ్ బందోపాధ్యాయ చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్లలో సోమవారం తెల్లవారు జామున ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు గల కారణాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మొహంతి సుప్రీంకోర్టు కమిటీకి వివరించారు.
ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్ను మరొకసారి తనిఖీ చేయాలని, ఇతర బస్సులు, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేసి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయాలని రోడ్డు భద్రత కమిటీ సభ్యులు ఆదేశించారు. ప్రతి వాహనం ఇన్సూరెన్స్ పర్మిట్ ఫిట్నెస్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణ పనులను తొందరగా పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి, మైనింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్ తదితరులున్నారు.