‘రీజనబుల్ టైం..’ అంటే ఎంతనో చెప్పండి.. శాసనసభ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండటమే సముచిత సమయమా? మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందితే పది నెలలకు నోటీసులు ఇచ్చారంటే ఏమనుకోవాలి?-సుప్రీంకోర్టు ధర్మాసనం
Supreme Court | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో తెలుసుకొని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శిని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ కేసులో శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన న్యాయవాదిని ధర్మాసనం నిలదీసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిర్యాదు అంది పది నెలలు గడుస్తున్నా వారికి నోటీసులు జారీచేసేందుకు ఇంకా తీరిక దొరకలేదా అని ప్రశ్నించింది. సముచిత సమయం కావాలని న్యాయవాది కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సముచిత సమయం అంటే శాసనసభా సమయం ముగియాలా? అసెంబ్లీ గడువు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోరా?’ అని నిప్పులు చెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసు మాదిరిగా చేస్తారా?.. అని నిలదీసింది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ, తాను స్పీకర్ తరఫున వాదించడం లేదని, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదిస్తున్నానని వివరించడంపై అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభ స్పీకర్‌తో మాట్లాడతారు కదా.. తెలుసుకుని చెప్పండని మండిపడింది. తమకు రెండు వారాల గడువు ఇస్తే తెలుసుకొని చెప్తానని న్యాయవాదం చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘తెలుసుకొని చెప్పడానికి హైదరాబాద్ వెళ్లక్కర్లేదు, ఫోన్లలో మాట్లాడి కూడా తెలుసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించింది. వారం రోజులు మాత్రమే గడువు ఇస్తున్నట్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.
ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారు?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల మీద మూడు నెలల్లోగా విచారణ చేపట్టాలని, అందుకు షెడ్యూల్‌ను ఖరారు చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి..’ అని గత నవంబర్ 22న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కే వివేకానంద్ జనవరి 16న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంక్రటావు, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తొలుత రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీపై వేరుగా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
హైకోర్టు ఆదేశించినా స్పీకర్ చర్యలు శూన్యం
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావు వాదనలు వినిపిస్తూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు పిటిషనర్లు ఫిర్యాదు చేసి పది నెలలైందని, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసి సుమారు ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ స్పీకర్ కార్యాలయం ఏవిధమైన నిర్ణయాలూ వెల్లడించలేదని తెలిపారు. కనీసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పందిస్తూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్పీకర్‌కు ఫిర్యాదు ఎప్పుడు అందింది, ఎప్పుడు నోటీసులు జారీ అయ్యాయి అని ప్రశ్నించింది. దీనిపై రోహత్గీ జవాబు చెప్తూ.. గత ఏడాది మార్చి 18న ఫిర్యాదు అందగా, ఈ ఏడాది జనవరి 15న స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు అవగాహన ఉందని, నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అవసరమని చెప్పారు. స్పీకర్ నిర్ణయాలు వెలువరించే విషయంలో సుప్రీంకోర్టు ఇంతకుముందు సుభాష్రాయ్ కేసులో ‘సహేతుక సమయం (రీజనబుల్ టైం)లోగా నిర్ణయం తీసుకోవాలి’ అని చెప్పిందని గుర్తుచేశారు. ఈ కేసులో స్పీకర్ ముందున్న ఫిర్యాదుల పరిష్కారానికి కోర్టులు షెడ్యూల్‌ను నిర్దేశించడానికి వీలు లేదని అన్నారు.
రీజనబుల్ టైం అంటే.. పుణ్యకాలం పూర్తి కావాలా?
‘రిజనబుల్ టైం..’ అంటే ఎంతనో చెప్పాలని ధర్మాసనం నిలదీసింది. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో వెలువరించిన తీర్పులను రోహత్గీ మరోసారి గుర్తుచేయగా.. జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకుంటూ.. ‘శాసనసభ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండటమే సముచిత సమయమా?’ అని నిలదీశారు. ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేవరకూ నిర్ణయం తీసుకోరా?, మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందితే పది నెలలకు నోటీసులు ఇచ్చారంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. దీనిపై రోహత్గీ బదులిస్తూ.. స్పీకర్‌కు ఫిర్యాదు అందాక పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడం వల్లనే జాప్యం జరిగిందని చెప్పారు.