హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై మార్చి 3న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది.
ఈ నెల 18న విచారణ జరగాల్సి ఉండగా, ధర్మాసనంలో జడ్జి ఇతర కేసుల విచారణలో ఉండటంతో సాధ్యపడలేదు. విచారణకు తేదీని నిర్దేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మోహిత్‌రావు ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు మార్చి 3వ తేదీని ఖరారుచేసింది.