హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను సుప్రీంకోర్టు (Supreme Court) నేడు(గురువారం) విచారించనున్నది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉండటంతో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తి వేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. ఈ పిటిషన్ తాజాగా న్యాయస్థానం రిజిస్ట్రీలో లిస్ట్ కావడంతో గురువారం విచారణకు రానున్నది. ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్‌మెహతా ధర్మాసనం విచారించనున్నది. అయితే ప్రభుత్వ వాదనలు వినడాని కంటే ముందే తమ వాదనలను కూడా పరిగణనలోకి హైకోర్టులో పిటిషనర్ మాధవరెడ్డి ఇప్పటికే కెవియట్ పటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం తెలంగాణ ప్రజలతోపాటు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.