(స్పెషల్ టాస్క్ బ్యూరో):హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): గుజరాత్‌లోని పామోల్ గ్రామానికి చెందిన మధుబెన్ చావ్డాకు నాలుగైదు ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం ఆమె పశువులకు దాణా పెడుతుంది. పశువులకు మేతగా గడ్డిని పెడుతుందనుకొంటే పొరపాటే. గోధుమపిండి, శనగపిండి, సోయాబిన్ పిండి, మొక్కజొన్న, చక్కెర, ఆయిల్, బియ్యంతో కూడిన మిశ్రమాన్ని మధుబెన్ పశువులకు దాణాగా పెడుతుంది. ఇది చూసి.. మధుబేన్ గొప్ప ధనవంతురాలని అనుకోవద్దు. ఆమె పేద మహిళే. అయితే, ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ ప్రభుత్వం నిర్వాకం వల్ల గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం.. ఇలా పశువుల కొట్టాలకు చేరుతున్నది. కారణం.. అది నాసిరకంగా ఉండటమే.
నెయ్యి కలిపి వండినా..
గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు ‘పూర్ణశక్తి’, ‘మాతృశక్తి’, ‘బాలశక్తి’ పేరిట గుజరాత్ ప్రభుత్వం అంగన్వాడీలు, రేషన్ దుకాణాల ద్వారా న్యూట్రిషన్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నది. అయితే, ప్యాకెట్లలోని మిశ్రమం ఏ మాత్రం రుచిగా లేదని మెహ్సానా జిల్లాలోని పామోల్ వంటి పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. న్యూట్రిషన్ పొడిలో నెయ్యి, పాలు కలిపి వండినప్పటికీ, పిల్లలు తినట్లేదని, దుర్వాసన కూడా వస్తున్నదని మండిపడుతున్నారు. ఇక, చేసేదేమీ లేక, పసిపిల్లలకు పెట్టాల్సిన ఆహారాన్ని పశువులకు దాణాగా పెడుతున్నట్టు వాపోతున్నారు.
‘న్యూట్రిషన్ పౌడర్ ఏ మాత్రం రుచిగా లేదు. అందుకే నా కొడుకు తినట్లేదు. ఇక, చేసేదేమీ లేక, పక్కింటి వాళ్ల పశువులకు పొడిని దాణాగా ఇచ్చేశా. ఇలాంటి పౌడర్‌ను సరఫరా చేస్తే, పిల్లలకు పోషకాలు ఎలా అందుతాయి?’
-ఏక్తా చావ్డా, గ్రామస్థురాలు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ భేష్
గర్భిణీల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని తీసుకొచ్చింది. రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్న తొమ్మిది ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో రూ.50 కోట్లతో ఈ పథకాన్ని కిందటి నెల ప్రారంభించారు. ఈ జిల్లాలలోని 1.25 లక్షల మంది గర్భిణులకు రెండుసార్లు కిట్లను అందజేస్తారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లలో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ మూడు బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్లు, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటాయి. కిట్‌లో ఉన్న ఆహారం ఎంతో రుచికరంగా, నాణ్యంగా ఉన్నదని ఇప్పటికే పలువురు గర్భిణులు ఆనందం వ్యక్తం చేశారు.