హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన నవజాత శిశువుల విక్రయ ఘటన కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. ప్రజలను ఎంతగానే కలిచివేసిన ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ రాకెట్ నుంచి 16 మంది చిన్నపిల్లలను కాపాడి, శిశువిహార్‌కు తరలించిన పోలీసుల కృషిని కమిషన్ అభినందించింది. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను కనుగొనడానికి, దోషులను విచారించి శిక్షించడానికి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి సమగ్ర విచారణ అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.