గజ్వేల్, మార్చి 31: కర్ణాటక రాజధాని బెంగళూరులో సాఫ్ట్వేర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నసాగర్‌కు చెందిన కుంట రఘుపతిరెడ్డి-జయమ్మ దంపతుల పెద్ద కొడుకు కుంట భానుచందర్‌రెడ్డి (32) 13 ఏండ్ల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. రెండేండ్ల క్రితం బెంగళూరుకు వచ్చి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అక్కడే పరిచయం అయిన మేడ్చల్ జిల్లాకు చెందిన బీబీ షాజియాసిరాజ్ (31)తో కలిసి కొంతకాలం సహజీవనం చేశారు. అనంతరం కుంట భానుచందర్‌రెడ్డి, బీబీ షాజియాసిరాజ్ పెండ్లి చేసుకున్నారు. భానుచందర్‌రెడ్డి సోమవారం ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో బీబీషాజియా సిరాజ్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచింది.
వారిసాయంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా భానుచందర్‌రెడ్డి ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. దీంతో షాక్‌కు గురైన బీబీ షాజియాసిరాజ్ అదే అపార్ట్మెంట్ 17వ పై అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతికి ఎవరూ కారణం కాదంటూ భానుచందర్‌రెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.