మల్దకల్, అక్టోబర్ 14: మహబూబ్నగర్ జిల్లా రాంరెడ్డిగూడెం గురుకుల కళాశాల హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని ప్రియాంక మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని సొంతూరైన మల్దకల్కు తీసుకొచ్చి మంగళవారం బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో చేపట్టగా, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. కొందరు యువకుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్ప డిందన్నారు. డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, ఎస్సై నందికర్ అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.