పెంబి, ఆగస్టు 3: పోస్ట్‌మన్ ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా పెంబి మండలం బుర్కరేగడికి చెందిన నైతం జంగుకు ఇద్దరు కొడుకులు, కూతురు.
పెద్ద కుమారుడు దత్తురాం 2021-22లో 8.5 గ్రేడ్‌తో పదో తరగతి పాసయ్యాడు. 2022-2024లో ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాడు. నెల రోజుల క్రితం పోస్టల్ శాఖలో పోస్ట్‌మన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగం ఇస్తారు.
దత్తురాం కంటే ఎక్కువ మార్కులున్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తనకు ఉద్యోగం రాదేమోనని బాధపడేవాడు. ఇంట్లో కూడా తనకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని నిరాశను వ్యక్తం చేశాడు. ఆగస్టు 1న తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక ఇంటి పక్కనే ఉన్న చేనులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిర్మల్ ప్రభుత్వ దఖాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున దత్తురాం (23) మృతి చెందినట్టు తెలిపారు. తండ్రి జంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శంకర్ తెలిపారు.