నల్లబెల్లి, జూలై 13: డీలర్ యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్ పట్టుకుని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. బిల్యానాయక్తండాకు చెందిన రైతులు ధన్‌రాజ్‌నాయక్, జుమికిలాల్ మండల కేంద్రంలోని కర్ర కృష్ణారెడ్డి ఎరువుల దుకాణానికి వెళ్లి యూరియా బస్తాలు కావాలని అడిగారు. 1,200 బస్తాల యూరియా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ.. కావాలనే ఇవ్వడం లేదంటూ వారు గోదాం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని రైతుల నుంచి పెట్రోల్ డబ్బాను లాక్కుని సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఏవో రజితతో ఎస్సై ఫోన్లో మాట్లాడగా.. డీలర్ వద్ద 1,200 బస్తాల యూరియా ఉన్నది వాస్తవమేనని, దాన్ని రైతులకు విక్రయించకపోవడం నేరమని అన్నారు. డీలర్‌పై చర్యలు తీసుకుంటామని ఏవో హామీ ఇచ్చారు.
డీలర్లకు అధికారుల వత్తాసు
ప్రైవేట్ డీలర్లకు వ్యవసాయశాఖ అధికారులు వత్తాసు పలుకుతుండటంతోనే వారు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రైవేట్ డీలర్ వద్ద 1,200 బస్తాల యూరియా ఉన్నప్పటికీ వాటిని విక్రయించకుండా పీఏసీఎస్ కార్యాలయంతోపాటు ఆగ్రోస్ కేంద్రాల వద్ద మేము రోజంతా మండుటెండలో లైన్లు కడుతున్నం. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– ధన్‌రాజ్‌నాయక్, బిల్యానాయక్ తండా