నీలగిరి, జూలై 12: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ ఉద్యోగి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ముకిరాల కరుణాకర్ కొన్నేండ్లుగా స్థానిక మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మద్యం తాగి విధులకు హాజరవుతున్నట్టు అధికారుల దృష్టికి రావడంతో ఏడాది క్రితం విధుల నుంచి తొలగించారు.
తనను కావాలని మంత్రి కోమటిరెడ్డి అనుచరులే ఒత్తిడి చేసి అకారణంగా తనను విధుల నుంచి తొలగించారని బాధితుడు పలుమార్లు ఆరోపించాడు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రి చుట్టూ, అతని అనుచరుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వాపోయాడు. చేసేదేమీలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో పెట్రోల్ పోసుకుంటుండగా అక్కడే ఉన్న టూటౌన్ పోలీసులు అడ్డుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్టు పోలీసులు పేర్కొన్నారు.