హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : జీవించేహకు కోసం భవిష్యత్తులో ఐద్వా పోరాటాలు కొనసాగిస్తుందని ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందరరామన్ తెలిపారు. మనిషి జీవించేందుకు తప్పనిసరి అయిన గాలి, నీటిని కూడా ప్రైవేటుపరం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిస్తామని వెల్లడించారు ఆర్టీసీ కల్యాణ మండపంలో ఐద్వా 14వ జాతీయ మహాసభల్లో మూడోరోజైన మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కార్పొరేట్ల కోసం రాష్ర్టాల్లో అడవులను నరికేస్తున్నారని, దీంతో స్వచ్ఛమైన గాలికి అల్లాడే పరిస్థితులు దాపురిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు మహిళల బతుకులపై బీజేపీ దాడి చేస్తున్నదని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు పొదుపు చేసిన రూ.600 కోట్లను తిరిగి వారికే ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఏడు పుస్తకాలను విడుదల చేశారు.