న్యూఢిల్లీ, జూలై 14 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు, పవన్‌కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీటీడీ క్రిస్టియన్ చేతిలో ఉన్నదని, అక్రమాలు జరుగుతున్నాయని బాబు, పవన్ తప్పుడు ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. టీటీడీపై తప్పుడు కథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశానని, ప్రస్తుతం ఈ కేసు ఏపీ హైకోర్టులో పురోగతిలో ఉన్నదని తెలిపారు. టీటీడీకి న్యాయసాయం అందిస్తానని, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా 24న తిరుమలేశుని దర్శించుకుంటానని స్పష్టం చేశారు.