హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ)లో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అధికారులను కేంద్ర జల్‌శక్తి ఆదేశించింది. ఏఐబీపీ ప్రాజెక్టుల పురోగతి, తదుపరి కార్యాచరణపై సౌత్ రీజియన్ రాష్ర్టాలతో కేంద్ర జలశక్తిశాఖ అధికారులు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా గురువారం ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రం నుంచి క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారటీ సీఈ రఘునాథరావు, ఎస్ఈ విద్యావతి తదితరులు పాల్గొన్నారు. ఐఏబీపీ ఫేజ్-1లో భాగంగా చేపట్టిన 11ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అందులో రాజీవ్‌భీమా, దేవాదుల, పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులు పూర్తయినట్టు వెల్లడించారు.
పెద్దవాగు కంప్లీషన్ రిపోర్టును సైతం డిసెంబర్ నాటికి సమర్పిస్తామని తెలిపారు. ఏఐబీపీ ఫేజ్-2 కింద తెలంగాణకు సంబంధించి చిన్నకాళేశ్వరం, చనకా కొరటా, మోడికుంట తదితర పలు కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తిశాఖకు విజ్ఞప్తిచేశారు. అందుకు జలశక్తిశాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. 2026-31కి సంబంధించి కొత్త ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర అధికారులకు సూచించారు. అక్టోబర్ 15 నాటికి ప్రొఫార్మాను పంపుతామని వెల్లడించారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలను పంపాలని వెల్లడించారు.