ఘట్కేసర్ రూరల్, జూన్ 3: గ్రామకంఠం భూమిని గిఫ్ట్ డీడ్ చేసేందుకు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ సీతారాం నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని అవుషాపూర్ గ్రామంలో గుమ్మడి సుదర్శన్.. తనకు చెందిన 140, 260 గజాల చొప్పున రెండు ప్లాట్లను కుమారుల పేరున గిఫ్ట్ డీడ్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ సీతారాం నాయక్‌ను కార్యాలయంలో కలిసి సంప్రదించాడు. రూ.80 వేలు చెల్లిస్తే గానీ కుదరదని చెప్పటంతో బ్రతిమాలుకుని రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాట్ల గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు డబ్బులు డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు సోమవారం సాయంత్రం సుదర్శన్ దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ సీతారాం నాయక్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి కిశోర్ లంచం డబ్బులు తీసుకున్నాడు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని సోదాలు జరిపారు. ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కర్మన్‌ఘాట్ గాయత్రీ నగర్‌లోని సబ్ రిజిష్టార్ ఇంటి వద్ద కూడ సోదాలు జరుపుతున్నట్టు తెలిపారు. నిందితుడు సీతారాం నాయక్‌ను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.