Varalaxmi Sarathkumar | కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన కెరీర్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ దర్శకురాలిగా మెగాఫోన్ పట్టింది. ఇప్పటివరకు వెండితెరపై పవర్ఫుల్ పాత్రలతో మెప్పించిన ఆమె తన స్వీయ దర్శకత్వంలో ‘సరస్వతి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వరలక్ష్మి ద్విపాత్రాభినయం చేస్తూ, ఒకవైపు కఠినమైన దర్శకురాలిగా, మరోవైపు నటిగా కనిపిస్తూ షూటింగ్ సెట్స్‌లో ఎదురయ్యే సరదా సంఘటనలను వినోదాత్మకంగా చూపించారు. హై-కాన్సెప్ట్ ఇన్టెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వరలక్ష్మి తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ‘దోస డైరీస్’ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్నారు. మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో పకడ్బందీ ప్రణాళికతో కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసి వరలక్ష్మి తనలోని స్పీడ్ డైరెక్టర్‌ను పరిచయం చేశారు. టైటిల్ లోగోలో ‘I’ అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది.