హాజీపూర్, ఫిబ్రవరి 6: పురుగుల అన్నం.. నీళ్ల చారు తినలేక పస్తులు ఉంటున్నామని గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లలోని సాంఘి క సంక్షేమ విద్యార్థులు మంగళవారం భోజ నం చేయకుండా నిరసన చేపట్టారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా, విద్యార్థులు పురుగుల అన్నాన్ని చూపించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ధర్నాకు వెళ్తుండగా, పాఠశాల సిబ్బంది గేట్లకు తాళా లు వేసి వారిని నిర్బంధించారు. ఇంతలోనే మీడి యా అక్కడికి చేరుకోగా.. పేరెంట్స్, విద్యార్థులు నినాదాలు చేయడంతో గేట్లు తెరిపించారు.
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో తమ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరెంట్స్ సమావేశానికి వచ్చే సమయంలో మాత్రమే పరిసరాలను కాస్త శుభ్రంగా ఉంచుతారని, మిగతా రోజుల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదని, ఆటలకు స్థలం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ మోహన్‌ను వివరణ కోరగా, స్పందించేందుకు నిరాకరించారు.