హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మిమ్మల్ని మీరు విశ్వసించడం.. నేర్చుకోవడం.. ఆలోచించడం.. సానుకూల ప్రకటనలను వినిపించడం ద్వారా కేరీర్‌ను తీర్చిదిద్దుకోవచ్చని ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ జరార్ పేర్కొన్నారు. విజయ్‌నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ‘తెలంగాణ టుడే- నమస్తే తెలంగాణ’ దినపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీబీఎం డైరెక్టర్ జరార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ఉండాలని, అతివిశ్వాసం ఉండకూడదని సూచించారు. అతివిశ్వాసం పొరపాట్లకు దారితీస్తుందని గుర్తుచేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకుసాగితే విజయం దగ్గరవుతుందని పేర్కొన్నారు. మంచిని అలవాటు చేసుకొంటే జీవితంలో ఎంతో ఉపయోగడపడుతుందని చెప్పారు. ఈ సెషన్‌ను ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లికేషన్స్‌కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డీ సరిత, డాక్టర్ స్వప్న, అధ్యాపకులు పాల్గొన్నారు.