మర్పల్లి, జూలై 12 : ఉడికీ ఉడకని అన్నంతోపాటు అన్నంలో పురుగులు వస్తున్నాయని, మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదంటూ వికారాబాద్ జిల్లా మర్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదుట శనివారం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని అన్నారు. అప్పుడప్పుడు అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఇదే విషయమై టీచర్లకు చెబితే వాటిని తీసేసి తినాలని సూచిస్తున్నారని వాపోయారు.
రోజుకో టిఫిన్ పెట్టాలని మెనూలో ఉంటే ప్రతిరోజు దొడ్డు రవ్వతో ఉప్మా వడ్డిస్తున్నారని తెలిపారు. తాగడానికి మంచి నీళ్లు సైతం ఉండవని, బయటి నుంచి వాటర్ డబ్బాల్లో నీళ్లు తెచ్చేంత వరకు బోరు నీళ్లు తాగుతున్నామని, దీంతో జ్వరాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.