హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దేశ భవిష్యత్తును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వేగంగా, భిన్నంగా ప్రజలకు అందించేందుకు సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు వినూత్న వెబ్సైట్ను ఆవిష్కరించారు. results 2024. in అనే పేరుతో ఆవిష్కరించిన ఈ వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను అంకెలు, గ్రాఫిక్స్ రూపంలో అందించనున్నారు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోం పేజీలో భారత దేశ చిత్రపటం కనిపిస్తుంది. దాని కింద ఎన్డీఏ, ఇండియా కూటమి, ఇతరులు ఎన్ని స్థానాల్లో గెలిచారో, ఎన్ని స్థానాల్లో ఓడిపోయారో పార్టీల వారీగా వివరాలు ఉంటాయి.
దీంతోపాటు రాష్ట్రాల వారీ జాబితా ఉంటుంది. భారత దేశ చిత్రపటంలో కావాల్సిన రాష్ట్రంపై క్లిక్ చేయగానే లైవ్ ఫలితాలు కనిపించడం మరో విశేషం. ఎన్నికల సంఘం అందించే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించి మొత్తం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల వారీగా పరిస్థితిని అంకెలతోపాటు గ్రాఫిక్స్ రూపంలో అందించనున్నారు . 2019 ఎన్నికల సమాచారాన్ని కూడా ఇందులో క్రోడీకరించారు. దీంతో రెండు ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు అవకాశం కలుగుతుందని విద్యార్థులు పేర్కొన్నారు.