RS Praveen Kumar | రంగారెడ్డి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు కుళ్లిన కూరగాయలతో నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురుకులాల్లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజనం, సౌకర్యాలను తెలుసుకునేందుకు ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని వివిధ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో ఆయన ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందం గురుకులాల బాట నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను వారికి ఏకరువు పెట్టుకున్నారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అరకొర నిధులనే కేటాయిస్తున్నదని, కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్థస్వతకు గురవుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టిందని చెప్పారు.
హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఎండగడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మతిస్థిమితం లేని మంత్రులతో ఆధారాలులేని ఆరోపణలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు మరుగుదొడ్లు లేక, కూర్చునేందుకు బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హయత్‌నగర్‌లోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, శేరిగూడలోని రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, ఇబ్రహీంపట్నం నల్లకంచలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు గెల్లు శ్రీనివాస్, ఎర్రొళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్, మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, నాయకులు కర్నె అరవింద్, కొండ్రు ప్రవీణ్, రమేశ్, టిల్లు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిరోజూ పురుగుల బియ్యంతో కూడిన అన్నం పెడుతున్నరు. ఈ పురుగులన్నం తినాలంటేనే భయంగా ఉన్నది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు, వంట వండేవారు ఏది పెడితే అది తినాలి. ఏంటి మీ లొల్లిక్కడ.. అని బెదిరిస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మా సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలి. – కావ్య, కస్తూర్బాగాంధీ పాఠశాల, ఇబ్రహీంపట్నం
మా వసతిగృహంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని ఎన్నోసార్లు మా టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందులోకి వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందిగా ఉన్నది. ఎప్పటికి ఈ సమస్య తీరుతుందో ఏమో.
స్నానాలు చేసేందుకు షాంపూలు, సబ్బులు ఇవ్వడం లేదు. హ్యాండ్‌వాష్ కోసం లిక్విడ్ ఇవ్వక చేతులు కూడా శుభ్రం చేసుకోవడం లేదు. సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించాలి. మా సమస్యలు తీర్చాలి.