హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు విద్యార్థుల విషయంలో పోలీసులు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులను అకారణంగా అరెస్టు చేయడమే కాకుండా, వారు విద్యార్థులు కాదంటూ అధికారిక ప్రకటన విడుదల చేయడమేంటి? అని మండిపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో ఆదివారం 53 మంది విద్యార్థులను అరెస్టు చేసి అదేరోజు రాత్రి సొంతపూచీకత్తుపై 51 మందిని విడుదల చేశారు. మిగిలిన ఇద్దరిని పోలీసులు తమ అదుపులోనే పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి హెచ్‌సీయూ పీడీఎఫ్ స్కాలర్ విద్యార్థి రోహిత్‌కుమార్, పీహెచ్డీ విద్యార్థి నవీన్‌కుమార్‌ను అరెస్టు చేసి కూకట్పల్లి 10 ఏఎంఎం కోర్టు ముందు హాజరుపరిచినట్టు యూనివర్సిటీ సెక్యూరిటీ సూపర్వైజర్ సురేందర్కుమార్కు నోటీసులు జారీచేశారు. అయితే, సోమవారం సాయంత్రం విద్యార్థులను రిమాండ్‌కు తరలించిన తరువాత విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మాత్రం అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కాదంటూ పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.