హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూలో ఈ ఏడాదిలోనైనా పీహెచ్డీలో అడ్మిషన్లు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల లెక్క తేలకపోవడమామా? మరో కారణమా? అన్న సంగతి పక్కన పెడితే, ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పీహెచ్డీలో అడ్మిషన్ల కోసం ఈ ఏడాది మే 21న ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేశారు. గత నెల 12 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో అర్హులైన వారి ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేశారు.
వెరిఫికేషన్ ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియ షెడ్యూల్ వాయిదా వేస్తూ యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయంపై అధికారులు మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచాలన్న ఆలోచనతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ వాయిదా పడటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తెలిపారు.