HCU | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ… తెలంగాణ తొలి దశ ఉద్యమ ఉద్ధృతి తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం. పార్లమెంటులో బిల్లు పెట్టి మరీ ఏర్పాటుచేసిన దేశంలోనే ఏకైక యూనివర్సిటీ ఇది. 1970 ప్రాంతంలో ఇక్కడ పర్యటించిన అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ కంచెగచ్చిబౌలిలోని 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని ఏర్పా టు చేస్తున్నామని ప్రకటించారు. జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్న ఈ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని కూడా సూచించారు. ఆమె ఈ ప్రాంతాన్ని ‘గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ (హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ను అందించే ప్రదేశం)గా అభివర్ణించారు. కానీ, ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఏకంగా 400 ఎకరాల భూములను ఇందిరమ్మ వారసులుగా చెపుకుంటున్నవారే, అందునా ఇందిరమ్మ రా జ్యంలోనే అర్రాజు పాడేందుకు సిద్ధమయ్యారు.
ఇదేమంటే, అసలు ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యమే లేదని బుకాయిస్తున్నారు. నాడు ఇందిరాగాంధీ చెప్పిన ‘గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ నిజమా? ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న కాంక్రీట్ జంగిల్ వాస్తవమా? క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఆశయాలను నెరవేర్చాల్సినవారే ఆ ‘గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ను కంటికిరెప్పలా కాపాడాల్సిందిపోయి, ఇలా తెగనమ్మడం ఎంతవరకు సమంజసం? నిజానికి, నాడు ఇందిరాగాంధీ చెప్పిన మాటలనే స్ఫూర్తిగా తీసుకొని, గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు యూనివర్సిటీ విద్యార్థులు కొంతకాలంగా పోరాడుతున్నారు. ఆ భూములను అ న్యాక్రాంతం చేయొద్దని ఉద్యమిస్తున్నారు. బా ధ్యతాయుతమైన ప్రభుత్వాలు జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని నినదిస్తున్నారు. పచ్చని ప్రకృతికి నిలయమైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి కాంక్రీట్ సిటీగా మార్చొద్దని, యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
1973లోనే 2,300 ఎకరాలు కేటాయింపు
హెచ్‌సీయూ పేరిట భూమి లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నిండు శాసనసభలో మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్‌సీయూ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 1973లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డీ) (ఈ) ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ పరిసరాల్లో వెనుకబడిన ప్రాంత విద్యార్థులు విద్య, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో కంచెగచ్చిబౌలిలోని 2,300 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి కేటాయించారని గుర్తుచేశారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములను నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దానినే సాకుగా తీసుకుని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి యూనివర్సిటీ పరిధిలోని భూముల జోలికి రావొద్దని కోరుతున్నారు. వే లం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్
హెచ్‌సీయూ పరిధిలోని భూములను ’గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’గా అభివర్ణిస్తారు. నాడు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఇక్కడి జీవావరణం భవిష్యత్తులో హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లా పని చేస్తుందని ఇందిరాగాంధీ, సరోజినీనాయుడు వంటి వారు వ్యాఖ్యానించారు. పెరుగుతున్న నగరీకరణ కారణంగా హైదరాబాద్ కాంక్రీట్ సిటీగా మారిపోతున్నది. కాలుష్యం పెరిగిపోతున్నది. ఇలాంటి సమయంలో విలువైన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన 400 ఎకరాల భూమి ఉన్నతమైన జీవావరణంతో కూడి ఉన్నది. అరుదైన జంతువులు, పక్షుల జాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మచ్చల జింకలు, నక్షత్రపు తాబేళ్లు, కుందేళ్లు, అడవి పందులు, అంతరించిపోయే దశలో ఉన్న పక్షులు ఇక్కడ ఉన్నాయి. నాగుపాములు, తాచుపాములు, కొండచిలువలు, రక్తపింజర జాతుల పాములు ఉన్నాయి. మరికొన్ని అరుదైన పక్షి జాతులు ఈ భూముల్లో నివసిస్తున్నాయి. జంతువులు, పక్షులతోపాటు వివిధ రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. అలాంజియం సల్విఫోలియం (లో బీపీకి ఔషధం), ఆజార్డికా ఇండికా (కామెర్లు, చర్మవ్యాధులకు ఔషధం), కెలొట్రోఫిస్ జైగాంన్షియా (యాంటీ బయాటిక్), కెతరాంథస్ రోసియస్ (లుకేమియా చికిత్స) తదితర జాతులకు నిలయంగా హెచ్‌సీయూ భూములున్నాయి.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు హెచ్‌సీయూ స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్‌సీయూ విద్యార్థులను గుంటనక్కలంటూ సంబోధించడాన్ని నిరసిస్తూ శనివారం యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. సీఎం తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. 400 ఎకరాల భూముల వేలాన్ని వెంటనే ఆపేయాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలోని భూములన్నింటినీ హెచ్‌సీయూ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
జీవ వైవిధ్యానికి పెనుముప్పు
హెచ్‌సీయూ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే హైదరాబాద్‌లో పర్యావరణం, జీవ వైవిధ్యానికి ముప్పుగా మారుతుంది. 400 ఎకరాల భూముల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించినా కాలుష్యం పెరిగిపోయి వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఫ్లెమింగో, ఫ్లె క్యాచర్ వంటి పక్షులు అంతరించిపోతాయి. క్యాంపస్‌లో ఎలాంటి వన్యప్రాణులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. వారికి తెలియదా? ఇక్కడి జీవావరణం గురించి? హెచ్‌సీయూ భూముల వేలంపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి.
-డాక్టర్ రవి జిల్లపల్లి, హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి, వైల్లైన్ ఫౌండర్, రీసెర్చ్ అసోసియేట్, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ-చికాగో
విద్యావ్యవస్థ విధ్వంసమే
ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హెచ్‌సీయూ భూములను లాక్కోవడం అంటే విద్యావ్యవస్థను విధ్వంసం చేయడమే అవుతుంది. పార్లమెంటులో అధికారికంగా ప్రకటించిన ఏకైక యూనివర్సిటీ హెచ్‌సీయూ. హెచ్‌సీయూ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం కలచివేస్తున్నది. ఇలా భూములను అమ్ముకుంటూ పోతే హెచ్‌సీయూ ఉనికే లేకుండా పోతుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే యూనివర్సిటీకి భూములిచ్చి మళ్లీ వాళ్లే తీసుకోవడం దారుణం. హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులుగా ఉన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు భూముల వేలాన్ని సమర్థిస్తూ నీడనిచ్చిన చెట్టునే నరుక్కుంటున్నారు. ఈ విషయంపై వారు పునరాలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పు. హైదరాబాద్‌కు ఆక్సిజన్ వంటి 400 ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనుకుని సీఎం క్షమించరాని తప్పు చేస్తున్నారు.
-గారపాటి ఉమామహేశ్వరరావు, విశ్రాంత ఆచార్యులు, హెచ్‌సీయూ
సర్కారు వాదన
హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ లేదు. జింకలు, పులులు, సింహాలు లేవు. ఆ భూముల్లో ఉన్నది కొన్ని గుంటనక్కలు మాత్రమే. ఆ భూములతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. లేక్స్, రాక్స్ అక్కడ లేవు. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం.. వచ్చి చూడండి. ఈ భూములను టీజీఐఐసీకి కేటాయించి, బహిరంగ వేలం ద్వారా అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను రాబట్టాలని చూస్తున్నాం. పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తున్నాం. ఆ భూముల చుట్టూ చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను విస్తరించడానికే వేలం వేస్తున్నాం.
– అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
క్షేత్రస్థాయి వాస్తవం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. హెచ్‌సీయూలో ఉన్నది గుంటనక్కలేనంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 720 జాతుల మొక్కలు, 10 జాతుల క్షీరదాలు, 15 జాతుల సరీసృపాలు, 200 జాతుల పక్షులు ఉన్నాయి. వందలాది మచ్చల జింకలు, వేలాది నెమళ్లు, నక్షత్రపు తాబేళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. సీఎం ఇక్కడికి వస్తే, ఆయనకు స్వయంగా చూపిస్తాం. యూనివర్సిటీ పరిధిలోని భూములు జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్నాయి. విద్యార్థులు, యూనివర్సిటీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సీఎం క్షమాపణలు చెప్పాలి.
– స్టూడెంట్స్ యూనియన్, హెచ్‌సీయూ