హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ)లో జీవవైవిధ్యం కోసం పోరాడుతున్న విద్యార్థులు, ప్రొఫెసర్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యసభలో బుధవారం ఆయన హెచ్‌సీయూలో జరుగుతున్న ప్రభుత్వ దమనకాండ గురించి రాజ్యసభలో ప్రస్తావించారు. దేశంలోనే తొలిసారిగా హెచ్‌సీయూ విద్యార్థులు ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ఉద్యమిస్తున్నారని, వారిని కాంగ్రెస్ సర్కారు బుల్డోజ్ చేస్తున్నదని మండిపడ్డారు.
మెస్‌చార్జీలు పెంచాలనో, బెటర్ ఫ్యాకల్టీని ఇవ్వాలనో వారు ఉద్యమించడం లేదని, తమ వర్సిటీ పరిధిలోని పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య అవసరాలకు హెచ్‌సీయూ భూములను అక్రమంగా లాగేసుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. జీవవైవిధ్యానికి నెలవైన వర్సిటీలో విధ్వంసం సృష్టించి 400 ఎకరాల భూములను అమ్ముకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. దీనిని అడ్డుకోబోయిన విద్యార్థులు, వారికి మద్దతుగా వెళ్లిన ప్రొఫెసర్లపై కూడా ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయిస్తున్నదని తెలిపారు. ఓ ఉన్నత విద్యాసంస్థపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నదని అభ్యంతరం వ్యక్తంచేశారు. సురేశ్‌రెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లోనే కింది విధంగా ఉన్నాయి.
‘హెచ్‌సీయూలో విద్య, పర్యావరణం, న్యాయం కోసం విద్యార్థులు పోరాడుతున్నారు. యూనివర్సిటీ నియమ నిబంధనలకు విరుద్ధంగా హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు, విద్యాభివృద్ధికి, పరిశోధనల కోసం వర్సిటీని 1974లో ఏర్పాటుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి వర్సిటీ భూములను వాణిజ్య అవరాల కోసం వాడుకోవాలని పాలకులు చూస్తున్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. వర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో 237 రకాల అరుదైన పక్షులు, జింకలు, పాములతోపాటు రాక్స్, లేక్‌లు ఉన్నాయి.
ప్రకృతి, జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేయడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తున్నది. అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుతున్నది. వర్సిటీలో 5,000 మందికి పైగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వారు మెస్‌చార్జీలు పెంచాలనో, బెటర్ ఫ్యాకల్టీ ఇవ్వాలనో ఉద్యమించడం లేదు. తమ వర్సిటీ పరిధిలోని ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ఉద్యమిస్తున్నారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు అని చూడకుండా ప్రభుత్వం దాష్టీకం ప్రదర్శిస్తున్నది. వారిని పోలీసులతో ఈడ్చిపడేసి లాఠీచార్జి చేయిస్తున్నది. అది అత్యంత దారుణమైన చర్య’ అని సురేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.