గద్వాల అర్బన్, జూలై 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి కేజీబీవీలో మొదటి అంతస్థునుంచి ఓ విద్యార్థిని కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. ఎస్వో, సిబ్బంది కథనం మేరకు.. కేటీదొడ్డి కేజీబీవీలో మక్తల్ మండలం భూత్పూర్కు చెందిన సాయిశ్రుతి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. మంగళవారం ఉదయం సాయిశ్రుతి కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు బిల్డింగ్ మొదటి అంతస్థు నుంచి జారిపడగా, గమనించిన సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి పద్మావతి మాట్లాడుతూ సాయిశ్రుతి రెండురోజుల కిందటే హాస్టల్‌కు వచ్చిందని తెలిపారు. ఇంటి విషయాలతో మానసికంగా వేదన చెందేదని, భోజనం కూడా సక్రమంగా చేయకపోవడంతోనే స్పృహతప్పి పడిపోయినట్టు పేర్కొన్నారు.