కేతేపల్లి, నవంబర్ 19: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామ శివారులో గల మూసీ గురుకుల పాఠశాలలో మంగళవారం సాయంత్రం విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన బద్దం చంద్రశేఖర్, అనిత దంపతుల కుమారుడు గణేశ్ మూసీ వద్ద గల మహాత్మాజ్యోతి బాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం వాష్రూమ్ నుంచి తిరిగి వస్తుండగా గణేశ్ పాముకాటుకు గురయ్యాడు. విషయాన్ని ప్రిన్సిపాల్ ధనమ్మకు తెలియజేయడంతో విద్యార్థికి అక్కడే ప్రథమ చికిత్స చేయించి, నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గణేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా విద్యార్ధి పాముకాటుకు గురైన సమయంలో పాఠశాలలో వైద్యసిబ్బంది ఎవరూ అందుబాటులో లేనట్టు తెలిసింది. పాఠశాల నిర్వహణ సరిగా లేదని, ప్రహరీ కూడా లేదని తరచూ పాములు వస్తున్నాయని గతంలోనే విద్యార్థులు తెలుపడంతో వారి తల్లిదండ్రులు పలుమార్లు యాజమాన్యానికి వినతులు అందజేశారు.