Ragging | ఖమ్మం జిల్లాలోని ఫార్మాసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను బాధిత విద్యార్థిని ఆశ్రయించింది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ తాళలేక ఓ విద్యార్థిని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది.
ర్యాగింగ్‌తో వేధింపులు తాళలేక కాలేజీ నుంచి వెళ్లిపోయిన తనకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధిస్తుందని శ్రుతి ఫిర్యాదులో పేర్కొంది. రూ.3లక్షలు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామంటున్నారని.. సదరు కాలేజీపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరింది. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ విద్యార్థికి వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేసే అధికారం కాలేజీ యాజమాన్యానికి లేదన్న కమిషన్.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నెల రోజుల్లో ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.