ఖమ్మం అర్బన్/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 21 : ఖమ్మంలో ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడేనికి చెందిన యోగానందిని(16) ఖమ్మం నగరంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నది. శుక్రవారం ఉదయం కళాశాల హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యోగానందిని చేతికి ఇటీవల సర్జరీ కావడంతో కళాశాలలో జరిగే పరీక్షలు రాయలేకపోయింది. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి సత్యరాజు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఖానాపురం హవేలీస్టేషన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ; ఆమనగల్లు గురుకుల పాఠశాలలో ఘటన
షాబాద్, ఫిబ్రవరి 21 : ఓ విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ఆమనగల్లు గురుకుల పాఠశాలలో జరిగింది. పదోతరగతి చదువుతున్న శ్రీజ అనే విద్యార్థిని.. తోటి విద్యార్థిని మాట్లాడటం లేదని మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం స్పిరిట్ తాగింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, ఎంఈవో లక్ష్మణ్‌నాయక్, సీఐ కాంతారెడ్డి, ఎస్సై రమేశ్ పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్నేహితురాలు తనతో మాట్లాడకపోవడంతోనే శ్రీజ స్పిరిట్ తాగిందని వారు తెలిపారు. విద్యార్థిని ఆరోగ్యం బాగున్నదని ప్రిన్సిపాల్ వినోల మీడియాకు చెప్పారు.