హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌పై పలువురు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ డిస్కమ్ వద్దని, దానికి లైసెన్సు జారీచేయరాదని విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని అభ్యర్థించారు. రైతు డిస్కమ్ పిటిషన్‌ను తిరస్కరించి, వెనక్కి పంపించాలని కోరారు. రైతు డిస్కమ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణ జరుపాలని, ఆయా అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాతే లైసెన్స్ జారీచేయాలని స్పష్టం చేశారు. రైతు డిస్కమ్‌కు పంపిణీ లైసెన్స్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఈఆర్సీ శుక్రవారం బహిరంగ విచారణ నిర్వహించింది. రైతులతోపాటు విపక్ష, అధికార పార్టీల నేతలు, రైతు సంఘాలు, విద్యుత్తు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యుత్తురంగ నిపుణులు భారీ సంఖ్యలో ఈ విచారణకు హాజరవడంతో ఈఆర్సీ హాల్ కిక్కిరిసిపోయింది. పోలీసులు కల్పించుకుని రద్దీని నియంత్రించాల్సి వచ్చింది.
ఇది రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటైన డిస్కమ్ కాదని, రైతన్నకు ఉరివేసే డిసమ్ అని విపక్ష బీఆర్ఎస్ మండిపడింది. మూడో డిస్కమ్ ఏర్పాటుపై సవాలక్ష సందేహాలున్నాయని విద్యుత్తురంగ నిపుణులు తెలిపారు. సంస్థాగత సంసరణల కోసం రైతన్నకు ద్రోహం చేస్తున్నారని పలువురు ఆక్షేపించారు. ఈఆర్సీ ఆమోదం లేకుండా జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పడమేంటని పలువురు పశ్నించారు. కొత్త డిసమ్ ప్రతిపాదనను ఆమోదించవద్దని కోరారు. దీనిపై ఈఆర్సీ చైర్మన్ స్పందిస్తూ.. రైతు డిస్కమ్‌కు లైసెన్సు ఇస్తామో, లేదో తెలియదన్నారు.
కొత్త అప్పు కోసమే: నర్సింహారెడ్డి
కొత్త అప్పుల కోసమే రైతు డిసమ్ను ఏర్పాటు చేస్తున్నారని పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్ సంస్థ ప్రతినిధి దొంతి నర్సింహారెడ్డి విమర్శించారు. రైతుల ప్రయోజనం కోసమే ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం సబబుకాదని మండిపడ్డారు. ఒక్క సెక్టార్ కోసం డిస్కమ్ ఏర్పాటు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న డిస్కమ్‌ల డైరెక్టర్లనే రైతు డిస్కమ్ డైరెక్టర్లుగా నియమించారని, ఇది ఓఅండ్ఎం సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. అసలే లోటుతో ఉన్న డిస్కమ్‌కు అప్పులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. జీవోలను రహస్యంగా పెడుతున్నారని మండిపడ్డారు.
సర్కార్ నిర్వాకం వల్లే: వేణుగోపాలరావు
సబ్సిడీ విడుదల చేయకుండా, సమయానికి డబ్బులివ్వకుండా స్వయంగా ప్రభుత్వమే డిస్కమ్‌లను ఆర్థికంగా దెబ్బతీస్తున్నదని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాలరావు విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పును డిస్కమ్లపైకి, ఈఆర్సీ మీదికి నెట్టడం సరికాదని మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాల ప్రకారం డిస్కమ్‌లకు విద్యుత్తు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే బకాయిలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు. రైతు డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తికాకుండానే లైసెన్సు కోసం తొందరెందుకని ప్రశ్నించారు.
రెండు డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు కుట్ర: శివాజీ
కొత్త డిస్కమ్ ఏర్పాటుపై ఉద్యోగుల్లో అనేక ఆందోళనలు ఉన్నాయని, రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తున్నదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకుడు శివాజీ తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఎంవోయూ చేసుకున్న తర్వాతే రైతు డిస్కమ్‌పై ముందడుగు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలి: రత్నాకర్‌రావు
ఆస్తుల విభజన పూర్తికాకుండా రైతు డిస్కమ్‌లో జూన్ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవడం ఎలా సాధ్యమని, మీటర్లు బిగించకుండా ఆపరేషన్స్ ఎలా చేయగలమని పవర్ జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు ప్రశ్నించారు. మళ్లీ అసెస్మెంట్ పద్ధతిలో ఎనర్జీ ఆడిటింగ్ చేయడం సబబేనా అని నిలదీశారు. ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్న రెండు డిస్కమ్‌ల నుంచి 2వేల మంది ఉద్యోగులు, ఇంజినీర్లను ఈ డిస్కమ్‌లోకి తీసుకోవడంతో మిగిలిన వారు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అభ్యంతరాలు.. బీఆర్ఎస్ చురకలు
రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ నుంచి మాజీ మం త్రులు జీ జగదీశ్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించబోగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మ న్ కోదండరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ఈఆర్సీ చైర్మన్‌కు బదులుగా మీరు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
విచారణలో నిపుణుల నుంచి వ్యక్తమైన ప్రశ్నలు