హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడి అశాంతిని సృష్టించాలనుకొనే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ స్పష్టంచేశారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రజలంతా సమన్వయంతో సోదరభావంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హోం మంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
శాంతిభద్రతల విషయంలో తెలంగాణ రాజీలేని విధానాన్ని అవలంబిస్తున్నదని మహమూద్ అలీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయని హోం మంత్రి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. చట్టం నుంచి ఎంతటివారైనా తప్పించుకోలేరని, తెలంగాణ ప్రజలు గంగా-జమున తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా ఉన్నారని అన్నారు.
నిరసనలు ఆగవు
మత విద్వేష వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టేంతవరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు.