హన్వాడ : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మహబూబ్ నగర్ మండల యూరియా పంపిణీ ( Urea Centres ) కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎరువులను అధిక ధరలకు ( High prices ) విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను కోరారు.
కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు కష్టాల్లో ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇస్తే కనీసం మంచి నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇచ్చే నీళ్లు సరిగ్గా క్లోరినేషన్ చేయడం లేదని మండిపడ్డారు. యూరియా కోసం వచ్చిన రైతుల పట్ల చులకనగా మంత్రులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వేదికలు కట్టిందని, కరెంటు , యూరియా, విత్తనాలు సకాలంలో ఇచ్చిందని గుర్తు చేశారు.
బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మంత్రి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో నెలకొన్న పరిస్థితులను మళ్లీ కాంగ్రెస్ హయాంలో చూస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రైతులను పంపిస్తు క్యూ లైన్లో నిలబెడుతున్నారని మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ మంత్రి తిరిగితే తెలుస్తదని సూచించారు. అధికారం ఉంది కదా ఏది పడితే అది మాట్లాడవద్దని హితవు పలికారు.
ఎరువుల పంపిణీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి మూర్ఛ వచ్చి పడి పోయిండు. అంబులెన్సుకు ఫోన్ చేస్తే సమయానికి రాలేదు. చనిపోతే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. రామగుండంలో ఫ్యాక్టరీ చెడిపోతే కూడా పట్టించుకో లేదని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నాటు వేసిన 10 రోజుల్లో యూరియా వేయకుంటే దిగుబడి తగ్గుతదని, దీంతో రైతులు నష్ట పోయే ప్రమాదముందని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ఉచితంగా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వర్షాలకు, యూరియా కొరతతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పది శాతం పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గణేష్, శ్రీనివాస్ రెడ్డి, మల్లు నర్సింహా రెడ్డి, కొండ లక్ష్మయ్య, చెన్నయ్య, జంబూలయ్య, రాఘవేందర్ గౌడ్, సుధాకర్ ఉన్నారు.