హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయ సమావేశంలో సీఎస్ మాట్లాడారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. నారోటిక్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను పోలీస్‌శాఖకు అందజేయనున్నట్టు చెప్పారు. పోలీస్‌శాఖ, ఎక్సైజ్, అటవీ, గిరిజన సంక్షేమం, రెవెన్యూశాఖలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై సమన్వయంతో పని చేస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.
ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈ కమిటీ సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా, పోలీస్ కమిషనరేట్లలో మాదక ద్రవ్యాల నిరోధక సెల్‌ను ఏర్పాటుచేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్ విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్, నారోటిక్ కంట్రోల్ బోర్డు జాయింట్ డైరెక్టర్ పీ అరవిందన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నారోటిక్స్ డీజీ డీపీ నాయుడు, నారోటిక్ కంట్రోల్ బోర్డు దక్షిణాది రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఐ సెల్ ఐజీ రాజేశ్‌కుమార్, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.