హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సహాయ సహకారాలు అందిస్తున్న స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరత వేధిస్తున్నదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎదుట వాపోయారు.
ప్రత్యేక చొరవ చూపి సిబ్బందిని నియమించాలని కోరారు. సచివాలయంలో బుధవారం మంత్రి సీతకను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాల్లో తొలి ప్రాధాన్యం స్త్రీనిధి రుణాలకు ఇవ్వాలని కోరారు. జిల్లా, మండల సమాఖ్య కార్యాలయాల్లో స్త్రీనిధి సిబ్బంది కూర్చోవడానికి కనీస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. స్త్రీనిధి సంస్థ లక్ష్యాలను సాధించాలంటే సెర్ప్, మెప్మా సిబ్బంది పరస్పర సహకారం అవసరమని, ఇందుకు ప్రత్యేక జీవో జారీచేయాలని కోరారు.