హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్‌ను నిర్మించనున్నారు. మొత్తంగా 653 మీటర్ల పొడవు, 12 మీటర్ల ఎత్తు, 27 గేట్లతో రోడ్ కమ్ బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. 5 టీఎంసీల సామర్థ్యంతో రూ.1,000 కోట్లతోనే వార్ధా బరాజ్‌ను నిర్మించవచ్చునని అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. దీనిద్వారా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరందిస్తారు.
నాడు ఇష్టారీతిన డిజైన్
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు డిజైన్‌ను ఇష్టారీతిన చేపట్టింది. వార్ధా, వెన్‌గంగా నదులు కలిసిన తరువాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద రూ.2,500 కోట్లతో బరాజ్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే, అక్కడ బరాజ్ నిర్మాణానికి సాంకేతిక అంశాలు సానుకూలంగా లేవని అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
బరాజ్‌ను నిర్మించాలంటే నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో ఉండాలని, కానీ తమ్మిడిహట్టి వద్ద 45 డిగ్రీల స్క్యూ షేప్‌లో నిర్మించాల్సి వస్తున్నదని, అది అంత క్షేమదాయకం కాదని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యయం రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు వేశారు. కేవలం 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అంత పెద్ద మొత్తం వెచ్చించడం నిరర్థకమని, నిర్వహణ కూడా భారంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. తమ్మిడిహట్టి పక్కనే చాప్రాల్ అభయారణ్యం ఉండటం, దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవ్వడం వంటి కారణాలతో సీడబ్ల్యూసీ అనుమతులకు ఆటంకాలు ఏర్పడతాయని నివేదించారు.
సీఎం కేసీఆర్ సుదీర్ఘ మేధోమథనం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ్మిడిహట్టి వద్ద ఉమ్మడి ఏపీలో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేశారు. దానిని రెండు భాగాలుగా చేశారు. నీటి లభ్యత ఆధారంగా మొదట మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వెన్‌గంగా, వార్ధా నదులు కలిసే తమ్మిడిహట్టి వద్ద కూడా బరాజ్‌ను నిర్మించి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు.
దానికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి, ముంపును నివారించేందుకు తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన బరాజ్ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించారు. అయినప్పటికీ ఇంజినీరింగ్ నిపుణులు వెల్లడించిన అనేక సాంకేతిక కారణాల రీత్యా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం ముందుకు సాగడంలేదు.
ఆయా సమస్యలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక దఫాలుగా ఇంజినీరింగ్ అధికారులతో సుదీర్ఘ మేధోమథనం సాగించారు. చివరకు బరాజ్‌ను తమ్మిడిహట్టి వద్ద కాకుండా వార్ధాపైనే నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ 58 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అందులో 20 టీఎంసీలు సరిపోతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు రూ.1,500 కోట్ల ఖర్చు తగ్గనున్నది. ముంపు సమస్య కూడా ఉండదు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే సీడబ్ల్యూసీకి నివేదించనున్నారు.
జీవధారగా 75 కిలోమీటర్ల కెనాల్
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం బరాజ్‌ను నిర్మించకుండానే తొలుత ఈపీసీ విధానంలో కాలువల తవ్వకాన్ని చేపట్టింది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 116 కిలోమీటర్ల కాలువను 75 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో తవ్వాల్సి ఉన్నది. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునాటికే 75 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు పూర్తయ్యాయి. బరాజ్ నిర్మాణం కాకపోవడంతో ఈ కాలువ నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వార్ధ్దాపై బరాజ్‌ను నిర్మించి అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి, తమ్మిడిహట్టి దిగువన కుడిమెట్టిగూడెం వద్ద ఇప్పటికే తవ్విన కాలువతో అనుసంధానించాలని నిర్ణయించారు. మొత్తంగా ఆ కాలువనే రిజర్వాయర్‌గా మార్చి 1.5 టీఎంసీలను నిల్వ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. వరద కాలువ తరహాలోనే ఈ కెనాల్ సైతం జీవధారగా భాసిల్లుతుందని ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో కలిగే ప్రయోజనాలు