గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:30:16

ఆగిన వరద సాయం

ఆగిన వరద సాయం

  • బాధితుల నోట్లో మట్టి
  • ప్రభుత్వ సాయంపై ప్రతిపక్షాల ఫిర్యాదు
  • సాయాన్ని ఆపాలని ఈసీ ఆదేశం
  • నోటికాడి బుక్కను అడ్డుకోవడంపై బాధితుల్లో ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కనీవినీ ఎరుగని వానలతో సతమతమై, ఇండ్లు వాకిలి నిండా మునిగి, సర్వస్వం కోల్పోయి సాయం కోసం వేయి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాదీ బీదసాదలపై పిడుగుపడింది. రాష్ట్రం అందజేస్తున్న రూ.10 వేల సాయాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. బీజేపీ, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు చేసిన ఫిర్యాదు కారణంగానే ఎస్‌ఈ సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దరఖాస్తు కోసం అప్పటికే మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరిన నిరుపేదలు ఈ విషయం తెలియగానే నిర్వేదానికి గురయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు శాపనార్థాలు పెట్టుకుంటూ నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

కట్టలు తెగిన ప్రజాగ్రహం..

ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసి బీజేపీ వరదసాయాన్ని నిలిపివేయడం దారుణమని చింతలకుంటకు చెందిన శోభారాణి  యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొట్టకొట్టారని తార్నాకకు చెందిన సుశీల కాషాయ పార్టీపై ధ్వజమెత్తారు. అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అన్నట్టుగా బీజేపీ వ్యవహార శైలి ఉన్నదని, కేంద్రం పైసా సాయం చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని అడ్డుకోవడం ఏమిటని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినంత మాత్రాన వరద కష్టాలు తీరిపోతాయా అని నిలదీశారు.

దేశంలో ఎక్కడా లేనంతగా.. 

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌ మహానగరం ఇటీవల కుంభవృష్టికి చిగురుటాకులా వణికిన విష యం తెలిసిందే. వరద ముంచెత్తడంతో లక్షలాది మంది ప్రజలు జల దిగ్బంధంలో నరకాన్ని చూశారు. గత నెల 20 నుంచి ఈ నెల 1 వరకు అధికార యంత్రాంగం ప్రత్యక్షంగా 4.86 లక్షల కుటుంబాలకు రూ.486 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేశారు. వర్షాలు తెరపియ్యడంతో బాధితుల బ్యాం కు అకౌంట్లలోనే వరద సాయాన్ని జమచేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లోనే వరద సాయం పంపిణీని మొదలుపెట్టింది. 

ప్రతిపక్షాల ఫిర్యాదుతో.. 

బాధితులకు సాయం అందుతుండటంతో ప్రతిపక్షాలకు కన్ను కుట్టినట్లుంది. ఎన్నికలను సాకుగా చూపి సాయాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. బీజేపీ నేతలు కూడా సోషల్‌ మీడియాలో పోస్టు లు పెట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ సాయా న్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 

దళిత ద్రోహి బీజేపీ: వంగపల్లి

వరదల కారణంగా నష్టపోయిన పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు ప్రభు త్వం సాయం అందిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ అడ్డుపడిందని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ ఆరోపించారు. వరదల్లో నష్టపోయిన వారిలో అత్యధికులు దళితులేనని చెప్పారు. ఓట్ల కోసం బీజేపీ దళితులకు ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరద సాయం అడ్డుకున్న బీజేపీ నేతలను తమ బస్తీలకు రాకుండా అణగారిన వర్గాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ తీరు సరికాదు

ఆపదలో ఉన్న  వరద బాధితులకు  ప్రభుత్వం సాయం అందిస్తుంటే బీజేపీ అడ్డుకోవడం  సరికాదు. కరోనా, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం కేసీఆర్‌ అందిస్తున్న 10వేల సాయం ఎంతో అండగా నిలుస్తున్నది. ఓట్ల కోసం పేదలను బీజేపీ ఇబ్బందులు పెట్టడం సబబు కాదు.  

-బుచ్చయ్య యాదవ్‌, చిక్కడపల్లి

మట్టి కొట్టుకు పోతారు

వరద సాయాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు మట్టి కొట్టుకుపోతారు. వరదలు ముంచెత్తితే ఎక్కడా లేనివిధంగా కేసీఆర్‌ ప్రభు త్వం రూ.10వేల సాయం అందిస్తున్నది. దీన్ని బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఎలక్షన్ష మోకా చూసి దెబ్బకొట్టారు.

- వెంకటమ్మ, కాచీగూడ

తగిన బుద్ధి చెప్తాం

వరద బాధితులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందజేస్తుంటే బీజేపీ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల నెపంతో బాధితులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఆపివేయించారు. ఓట్ల కోసం మా దగ్గరికి వస్తే తగిన బుద్ధి చెప్తాం.

- ఎం.సురేష్‌, పటేల్‌నగర్‌, అంబర్‌పేట