హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలు ను నిలిపివేయాలంటూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆమె సీఎంవోలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తనను సాక్షిగా పిలిచిందని, అయితే తనపై ఆరోపణలు చేసే ముందు చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. విచారణ కమిషన్ చట్టం-1952లోని 8బీ, 8సీ సెక్షన్ల ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న నిబంధనలను కమిషన్ అమలు చేయలేదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఆ నిర్మాణ పురోగతిని సమీక్షించానని తెలిపారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి హోదాలో మూడు బ్యారేజీల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించినట్టుగా కమిషన్ నివేదికలో ఉన్నదని పేర్కొన్నారు. మేడిగడ్డ, అ న్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో తన ప్రమేయం లేదని తెలిపారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులను విచారించే అవకాశం కూడా కల్పించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు లోబడి ఉన్నదని తెలిపారు. క్యాబినెట్ ఎదుట ఫైళ్లు ఉంచలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని కమిషన్ పేరొనడం చెల్లదని తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. నివేదిక రద్దు చేయాలనని, తుది ఉత్తర్వులు వెలువరించే వరకు నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.