న్యూఢిల్లీ, జూలై 23: ప్రపంచవ్యాప్తంగా రాజరికాలు, నిరంకుశత్వాలు అంతరించి సంక్షేమ రాజ్యాలు నడుస్తున్న కాలమిది. ప్రజల జీవనాన్ని వీలైనంత సుఖవంతం, సులభతరం చేయటమే ప్రభుత్వాల అత్యున్నత కర్తవ్వంగా భావిస్తున్న కాలమిది. కానీ, మనదేశాన్ని ఏలుతున్న పాలకులు మాత్రం ప్రజలపై ఎడాపెడా పన్నులేయండి.. ప్రభుత్వ ఖజానా నింపుకొనేందుకు ప్రజల రక్తాన్ని పిండండి.. సంక్షేమ పథకాలను ఎత్తేయండి.. అంటూ రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారు. మద్యంపై ఎక్సైజ్ పన్నుతోపాటు ఆదాయం పన్నులను భారీగా పెంచాలని, స్థానిక సంస్థల్లో ప్రతి పనికి భారీగా ఫీజులు వసూలుచేసి ఆదాయం పెంచుకోవాలని కేంద్రంలోని మోదీ సర్కారు అన్ని రాష్ర్టాలకు సూచనలు చేసింది. గత నెలలో రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, పన్నులు ఎలా పెంచుకోవాలన్నదానిపైనే మీటింగ్ ఆసాంతం మాట్లాడారు.
మేం పిండుతున్నాం.. మీరూ పిండండి
ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పన్నుల భారం ఎలా పెంచుతున్నదో రాష్ర్టాల సీఎస్‌లకు టీవీ సోమనాథన్ ప్రజెంటేషన్ ఇచ్చి విడమర్చి చెప్పారు. ఖర్చులు తగ్గించుకొనేందుకు 231 స్వతంత్ర సంస్థలను 112 సంస్థలుగా పునర్వ్యవస్థీకరిస్తున్నామని గొప్పలు పోయారు. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ (సీఎస్ఎస్) సమీక్షించనున్నామని ప్రకటించారు. అంటే ఆ పథకాల్లో చాలావాటిని ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ఉన్నదని చెప్పకనే చెప్పారు. చాలా పథకాలను కుదించే ప్రతిపాదన కూడా ఉన్నదని హింట్ ఇచ్చారు. ఇప్పటికే మోదీ సర్కారు 130 సీఎస్‌ఎస్‌లను 60కి కుదించింది.
ఆరింటిని పునఃసమీక్షించి కొనసాగిస్తున్నది. అంటే మొత్తం 130 పథకాలను 66కు తెచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ర్టాల సొంత ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. మద్యంపై ఎక్సైజ్ పన్ను, పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలోనే అధిక ఆదాయం పొందుతున్నాయి. ఈ మార్గాల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకొనేందుకు పన్నులు పెంచాలని రాష్ర్టాలకు సోమనాథన్ సూచించటం గమనార్హం. ఆదాయం పెంచుకొనేందుకు ఆస్తిపన్ను తేలికైన విధానమని, ధనికులపై అధిక పన్నులు వేయాలని సలహా ఇచ్చారు. వీటితోపాటు రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ప్రతి సేవకూ భారీగా ఫీజులు పెంచాలని సూచించటం విశేషం.
మున్సిపాలిటీల్లో ముక్కుపిండి వసూలు చేయండి
స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు తగ్గించి, ఆయా పాలనా సంస్థలు స్వయంగా ఆదాయం పెంచుకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అందుకోసం మున్సిపాలిటీల్లో ప్రతి పనికి ఫీజులను భారీగా పెంచాలని తెలిపింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల్లో మున్సిపాలిటీల్లో పన్నులు 6-7 శాతం వేస్తున్నారని, మన దేశంలో 0.8 శాతమే పన్నులున్నాయని గుర్తు చేసిన సోమనాథన్, ఇక్కడ కూడా భారీగా పన్నులు పెంచాలని కోరారు. ఫీజులు, పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించారు. ఇప్పటికే కేంద్రం పెంచిన ధరలతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఇప్పుడు రాష్ర్టాలు కూడా మోదీ సర్కారు చెప్పినట్టు విని పన్నులు పెంచితే తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.