నవీపేట/భైంసా, ఏప్రిల్ 10: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) వద్ద శనివారం అర్ధరాత్రి దుండగులు ఆర్టీసీ బస్సు దోపిడీకి యత్నించారు. భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ అమృత వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి భైంసా వెళ్తున్న బస్సుపై అబ్బాపూర్(ఎం) సమీపంలోని ధర్మారం క్రాసింగ్ వద్ద రోడ్డుకు పక్కన కాపు కాచి ఉన్న దుండగులు రాళ్ల దాడికి దిగారు. బస్సులో ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బాబా చాకచక్యంగా బస్సు వేగం పెంచి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించాడు. బస్సులో కండక్టర్ హన్మంత్తోపాటు 21 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనలో బస్సు మూడు అద్దాలు పగిలిపోగా ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలావుండగా మూడు నెలల క్రితం అబ్బాపూర్ సమీపంలోనే భైంసా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపైనా దుండగులు దారి దోపిడీకి విఫలయత్నం చేశారని ఆమె గుర్తుచేశారు. ఈ మేరకు నవీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.