STF Police | గంజాయి, డ్రగ్స్ ఏది కావాలన్నా.. ఫోన్ చేస్తే చేస్తే చాలు.. ఫలానా చోటికి రండి .. గంజాయి, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బాస్ట్స్.. వీటిల్లో ఏది కావాలన్నా ఇస్తామని కస్టమర్లకు ఫోన్లు చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు జరిపే ముఠాను మంగళవారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ పరిధిలోని షేక్‌పేట్, టోలీ చౌక్ ప్రాంతాల్లో కార్లలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ సారధ్యంలో మంగళవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించారు. ఒక ఫోర్ట్కారులో ఒక యువతి, ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. మరో వ్యక్తి స్కూటీపై వచ్చి గంజాయి ప్యాకెట్ కారులో ఉన్న వ్యక్తులకు ఇస్తుండగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. తదుపరి స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్ద నుంచి ఒక కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీలో కారులో 1.700 కేజీల గంజాయి ఉంది.
మొత్తంగా 2.700 కిలోల గంజాయి, 11 గ్రాముల ఎండీఎంఏ, 3 ఎల్ఎస్డీ బాస్ట్స్ లభించాయి. పట్టు గంజాయి డ్రగ్స్ విలువ రూ.1,84,500 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కారు, స్కూటీ విలువ రూ. రూ.6,00,000 ఉంటుందని అంచనా వేశారు. గంజాయి డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన నిందితుల్లో పీ సాయిబాబు, వై వెంకటరెడ్డి, వీ సోనియా ఎలిషా అలియాస్ ప్రియాంకలను అరెస్టు చేసి గోల్కొండ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్‌ను పట్టుకున్న ఎస్టీఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాయికుమార్, కరణ్, ప్రసాద్, తరుణి, నిఖిల్ ఉన్నారు. ఒకే చోట మూడు రకాల డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను పట్టుకున్న ఎస్టీఎఫ్ సిబ్బందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్‌రెడ్డి అభినందించారు.