హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో స్టెగోడాన్ ఏనుగు దంతాల పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి సంస్థకు ప్రత్యేకంగా పెవిలియన్‌ను కేటాయించారు. ఈ పెవిలియన్‌ను సంస్థ సీఎండీ ఎన్ బలరాం, బిర్లా సైన్స్ సెంటర్ చైర్పర్సన్ నిర్మల బిర్లా శనివారం ప్రారంభించారు.
సింగరేణి సంస్థ పరిధిలోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గని తవ్వకంలో లభ్యమైన 11 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలతో ఈ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టెగోడాన్ జాతి 6వేల ఏండ్ల క్రితం భూమి నుంచి అంతరించిపోయినట్టు పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు.
ఈ జాతి ఏనుగుల అవశేషాలు గతంలో నర్మదానది ఉపనది ప్రాంతం, ప్రపంచంలో నాలుగైదు ప్రదేశాల్లో మాత్రమే లభించాయి. ఈ ఏనుగు దంతాల్లో ఒక జతను బిర్లా మ్యూజియంలో ప్రదర్శించగా, మరో జతను నెహ్రూ జూపార్క్‌కు అందజేశారు. ఏనుగు దంతాలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.