హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలోని విలువైన భూములను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీకి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్లో 55 ఎకరాలు, శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో 100 ఎకరాలు కేటాయించడాన్ని సమర్ధిస్తూ ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 2010లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిబంధలనలకు విరుద్ధంగా ఈ భూములను కేటాయించిందని, అప్పట్లో రూ.525 కోట్ల విలువ ఉన్న ఈ భూములను ఎకరం రూ.2 లక్షల చొప్పున కేవలం రూ.3.10 కోట్లకే కట్టబెట్టిందని పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ గండ్ర మోహన్‌రావు, మోహిత్‌రావు వాదించారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు దారిద్య్రరేఖకు దిగువన లేరని, అందువల్ల ఈ భూములను కేటాయింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది.