హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘టూరిజం పాలసీ 2025-30’ అటకెక్కింది. పర్యాటక రంగం అభివృద్ధికి వచ్చే ఐదేండ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ప్రభుత్వం.. పాలసీ అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శించడంలేదు. కొత్త టూరిజం పాలసీ తీసుకొచ్చి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు రూ.10 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేకపోయింది. రాష్ట్రంలో టూరిజం పాలసీ అమలవుతున్నదా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు పెట్టుబడులు ఏవీ?
టూరిజం పాలసీ ద్వారా ప్రైవేటు సంస్థల నుంచి రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావించింది. పెట్టుబడులతో టెంపుల్, ఎకో, మెడికల్ అండ్ వెల్నెస్ , స్పిర్చువల్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం రంగాలను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి సర్కారు ఎంతో ఆర్భాటంగా చెప్పింది. కానీ, వాటిపై ఇంతవరకు కనీస దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉన్నది.
3 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
టూరిజం పాలసీ ద్వారా 2030 నాటికి మొత్తం రూ.15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు 3 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పటివరకు కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలెవరూ ఆ శాఖను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.