Duvvuri Subbarao | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఉచితాలు వద్దంటూనే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు హామీలు గుప్పిస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విమర్శించారు. హైదరాబాద్లోని సెస్(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) ఆవరణలో గురువారం జరిగిన బీపీఆర్ విఠల్ 3వ స్మారకోపన్యాస సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దువ్వూరి మాట్లాడుతూ.. రాష్ర్టాల్లో అమలు చేస్తున్న ఉచితాలపై కేంద్రం చొరవ చూపాలని సూచించారు. ఉచితాల కంటే రహదారులు, విద్య, వైద్య రంగాలపై ఎక్కువ ఖర్చుచేస్తే సుస్థిరాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఉచితాలు కొంత మేరకు సమర్థనీయమైనా.. దీర్ఘకాలంలో దేశ అభివృద్ధి, సంక్షేమానికి ప్రమాదకరంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉచిత పథకాలను అడ్డుకోవడానికి అన్ని రాష్ర్టాలు, రాజకీయ పార్టీలతో కేంద్రం మాట్లాడి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. గతంలో ప్రణాళిక సంఘం, ప్రస్తుతం నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, విధాన రూపకల్పనలో మార్పులు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
జీఎస్టీ కారణంగా పన్నులు పెంచే విషయంలో రాష్ర్టాలు స్వయంప్రతిపత్తిని కోల్పోయాయని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ర్టాలకు ఉమ్మడి ప్రణాళిక ఉంటేనే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, సెస్ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ హనుమంతరావు, జీఆర్ రెడ్డి, ప్రొఫెసర్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.