హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో మరో కొత్త రగడ మొదలైంది. యూత్ కాంగ్రెస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి పోటాపోటీ రాజకీయం నడుస్తున్నది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పోస్టుకు ప్రాధాన్యం పెరిగింది. ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు జిల్లా స్థాయిలో నేతలను పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీల్చినట్టు చర్చ జరుగుతున్నది. గతంలో రాష్ట్రస్థాయి నేతల నిర్ణయంతో అధ్యక్షుల ఎంపిక పూర్తికాగా ఇప్పుడు పలువురు నేతలు ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు ప్రచారం. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఇటీవల శాట్ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ బంధువు పొన్నం తరుణ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి కుమారుడు శివచరణ్‌రెడ్డి తదితరులు పోటీలో నిలిచారు.
వీరితోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సామ్రాట్ వంశీ, దీపక్ ప్రగ్య కూడా పోటీ పడుతున్నారు. ఈ పదవికి పలువురు సీనియర్ నేతల వారసులు, అనుయాయులు రంగంలోకి దిగడంతో తీవ్ర పోటీ నెలకొన్నది. ఎవరికి వారు తమ అనుయాయులను అధ్యక్షుడిగా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు కూడా రెండుగా చీలినట్టు తెలిసింది. జిల్లాల్లో అయితే ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఈ అంశం చిచ్చుపెట్టినట్టు తెలుస్తున్నది. కీలక నేతల మధ్య కూడా వైరం నడుస్తున్నది. పీసీసీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం నియమించనున్నది. ఈ నేపథ్యంలో వచ్చే కొత్త అధ్యక్షుడు వారికి నచ్చిన వారిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారమూ జరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా యడవెల్లి వెంకటస్వామిని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది. మరో ఎనిమిది రాష్ర్టాలలో కూడా ఎన్ఎస్యూఐ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీహార్‌కు జయశంకర్‌ప్రసాద్, చండీగఢ్‌కు సికిందర్ బూర, ఢిల్లీకి అశిష్ లంబా, హిమాచల్‌ప్రదేశ్‌కు అభినందన్ ఠాకూర్, జార్ఖండ్‌కు బినయ్ ఓరాన్, మణిపూర్‌కు జాయ్సన్ కేహెచ్, ఒడిశాకు ఉదిత్నారాయన్ ప్రధాన్, పశ్చిమబెంగాల్‌కు ప్రియాంక చౌదరీని నియమించారు.